ఈ రోజే చంపారన్ కు మోదీ, ..అసలు ఆ ప్రాంత ప్రాముఖ్యత ఏమిటి,అక్కడేం జరిగింది

‘‘నిజం చెప్పాలి. అప్పటి వరకు నాకు చంపారన్ ఊరు పేరే కాదు ఈ ప్రాంతపు భౌగోళిక స్వరూపం కూడా తెలియదు’’ అని గాంధీజీ తన ఆత్మకథలో రాసుకున్నారు. తెలియని ప్రాంతానికి వచ్చినా నీలిమందు రైతులను బ్రిటిష్ వారి దోపిడీ నుండి కాపాడ్డం కోసం విసుగు చెందకుండా సుమారు సంవత్సరం పాటు తీవ్రమైన ఉద్యమం జరిపారు. సాధారణ ప్రజలను ఒక అంశంపై శాంతియుతంగా సమీకరించడంలో తనకు గల అసాధారణమైన శక్తి సామర్థ్యాలను మొదటిసారిగా ఇక్కడ ప్రదర్శించారు. పట్టుదల చూసిన ప్రభుత్వానికి ఒక విచారణ కమిషన్ వేయక తప్పలేదు. ఆ కమిషన్‌లో గాంధీజీని కూడా ఒక సభ్యునిగా నియమించారు. అప్పటికే 8 వేల మంది రైతుల కథనాలను నమోదుచేసి వుండడంతో వాటిని సాక్ష్యంగా ముందుంచారు. దానితో రైతులను దోపిడీకి, అణచివేతకు గురిచేస్తున్న తింకతియా విధానాన్ని రద్దు చేసారు. వారినుంచి దోచుకొన్న కొంత మొత్తాలను తోటల యజమానులకు తిరిగిచ్చారు. తాము పండించే పంటలపై రైతులకు మరింత నియంత్రణ కల్పిస్తూ బ్రిటిష్ ప్రభుత్వ ఆధ్వర్యంలోని తోటల యజమానులు రైతులకు ఒప్పంద పత్రాలు కూడా రాసి ఇవ్వవలసి వచ్చింది. అంతేకాదు బ్రిటిష్ ప్రభుత్వం లెజిస్లేటివ్ కౌన్సిల్‌లో బిల్లును ప్రవేశపెట్టి రైతులకు అనుకూలంగా ‘బిహార్ అగ్రేరియన్ యాక్ట్’ను అమలు చేసింది. చంపారన్ రైతుల కష్టాలను తొలగించడంలో గాంధీజీ విజయం సాధించారు. ఈ ఘన విజయం దేశ స్వాతంత్య్ర ఉద్యమాన్ని కొత్త దిశవైపు నడిపించడానికి దోహదపడింది.