ఈ రోజే చంపారన్ కు మోదీ, ..అసలు ఆ ప్రాంత ప్రాముఖ్యత ఏమిటి,అక్కడేం జరిగింది

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు (మంగళవారం) బిహార్‌లోని మోతిహరిలో పర్యటించనున్నారు. చంపారన్‌ సత్యాగ్రహం వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ముగింపు ఉత్సవంలో పాల్గొనేందుకు మోదీ అక్కడకు వెళ్తున్నారు. అక్కడ ఆయన చంపారన్‌ సత్యాగ్రహ శతాబ్ది ఉత్సవాల ముగింపులో పాల్గొనడంతో పాటు వివిధ అభివృద్ధి పనులను ప్రారంభిస్తారు. చంపారన్‌ సత్యాగ్రహ ఉత్సవాల్లో భాగంగా 20 వేల మంది స్వచ్ఛగ్రహిలను ఉద్దేశించి ప్రధాని ప్రసంగిస్తారు. ఇంతకీ చంపారన్‌ సత్యాగ్రహం అంటే ఏమిటి.. భారత స్వాతంత్య్ర సమరానికి ఆత్మవిశ్వాసాన్ని, ఆయుధాన్ని అందించిన ఉద్యమం గాంధీజీ నిర్వహించిన చంపారన్ సత్యాగ్రహం. దేశానికి స్వాతంత్య్ర కాంక్షను రగిల్చిన ఆ సంఘటన జరిగి సరిగ్గా వందేళ్లు పూర్తయ్యాయి. 19వ శతాబ్దంలో బీహార్‌లోని చంపారన్‌లో రైతులు తమ భూమిలో 3/20 భాగం నీలిమందు పండించాలని ఐరోపా తోటల యజమానులు బలవంతపెట్టేవారు. దీన్నే ‘తీన్ కథియా విధానం’ అని పిలిచేవారు. రాజ్‌కుమార్ శుక్లా అనే రైతు కోరిక మేరకు గాంధీజీ సత్యాగ్రహం చేపట్టారు. జిల్లాను వదిలి వెళ్లాలని ప్రభుత్వం గాంధీజీని ఆదేశించినా ఆయన భయపడలేదు. గాంధీజీ విచారణ కమిటీని ఏర్పాటు చేయాలని కోరగా ప్రభుత్వం అంగీకరించింది. విచారణలో భాగంగా రాజేంద్రప్రసాద్, జె.బి.కృపలానీ వేలాది మంది రైతుల వాంగ్మూలాలను రికార్డు చేశారు. దీంతో తీన్ కథియా విధానాన్ని రద్దు చేశారు. చంపారన్‌ అనేది భారత్‌లో గాంధీ మొట్టమొదటి రాజకీయ అనుభవం మాత్రమే కాదు, గాంధీ రాజకీయ జీవిత ప్రస్థానానికి, అలాగే స్వాతంత్య్ర పోరాటానికి అది కచ్చితమైన పునాదిగా చెప్తారు. సహాయ నిరాకరణ, ఉప్పు సత్యాగ్రహం, శాసన ఉల్లంఘన, క్విట్‌ ఇండియా వంటి ఉద్యమాల ప్రస్థానానికి, విదేశీ పాలన నుంచి దేశ విముక్తికి చంపారన్‌ నిశ్చయాత్మకంగా ఒక కీలకమైన ముందడుగుగా అభివర్ణిస్తారు.